పోరుమామిళ్ల:ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ చాలా అసంబద్ధాలతో లోపభూయిష్టంగా ఉన్నందున ఉపాధ్యాయ సంఘాలుగా సర్దుబాటును బహిష్కరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యోప్టో) రాష్ట్రనేత పి.రమణారెడ్డి తెలిపారు. సోమవారం కలసపాడులోని మండలవిద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టి,ఎంఇవోలు పి.ఎం.ప్రేమ సాగర్,ఎస్.మస్తాన్ వళి లకు వినతిపత్రం అందజేసిన తదనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ, రకరకాల ప్రయోగాలకు విద్యారంగాన్ని వేదికగా మార్చి,ప్రభుత్వ విద్యారంగం నష్టపోయేలా చేస్తున్నారన్నారు. ఈమధ్య జరిగిన చర్చలలో ఉపాధ్యాయ సంఘాలుగా చెప్పినటువంటి ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా రాష్ట్ర విద్యాశాఖ ఈ ప్రక్రియను అత్యవసరంగా చేపడుతుంది.కావున దీన్ని నిరసిస్తూ ఈరోజు జరిగే కౌన్సిలింగ్ ని బహిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి జీఓ 117 ను రద్దు చేయాలని, జిఓ 53 ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.పదోన్నతులు నిర్వహించిన తదుపరి మాత్రమే సర్దుబాటు చేయాలన్నారు.
ఫ్యోప్టో మండలనాయకులు సి.వెంకటరెడ్డి,కె.క్రిష్ణారెడ్డి,బి.ఎన్.వి.ప్రసాద్ లు మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు పూర్తి అయినప్పటికీ నిర్వహణగ్రాంట్లు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. పెండింగులో ఉన్న పీఆర్సీ,డి.ఎ, సరెండర్ లీవు బకాయిలను చెల్లించాలన్నారు. అవసరమైన చోట విద్యావాలంటీర్లను నియమించాలని ముఖ్యమంత్రి చెప్పిన విషయంపై దృష్టి సారించకపోవడం సమంజసంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు శేఖర్ బాబు, బాలజోజి,ఎస్వీ. సత్యనారాయణ, కె.వి.సత్యనారాయణ,కె.శ్రీనివాసులు,శివారెడ్డి, బాలరాజునాయక్, కిరణ్ కుమార్,విజయభాస్కర్ రెడ్డి, బాలచెన్నయ్య,గురుప్రసాద్,రామక్రిష్ణారెడ్డి,మస్తాన్,తిరుపతిరెడ్డి,గురయ్య,వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

