బెంగళూరు:మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఈడీ ఆదేశించింది. రేపు(శుక్రవారం అంటే ఫిబ్రవరి 23న) బైజూస్ కంపెనీ బోర్డు సభ్యులు, మెయిన్ ఇన్వెస్టర్ల గ్రూప్ దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రవీంద్రన్‌ను తొలగించడానికి సిద్ధమైన సమయంలోనే… ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ లుక్ అవుట్ నోటీసుల జారీ కోసం ఈడీ ఈ నెల ప్రారంభంలోనే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్(BOI)ని సంప్రదించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ మరియు కంపెనీ ఫౌండర్ విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) కింద రూ.9,362.35 కోట్ల ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) జారీ చేయాలని కోరింది, రవీంద్రన్ దర్యాప్తు అధికారికి తెలియజేయకుండా దేశం విడిచి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపింది.