మత్స్యకారులకు మరింత ప్రోత్సాహం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ఉపయోగించుకోవాలి
- జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
- మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలి : జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
మత్స్యకారులకు అవసరమైన మరింత ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ వద్ద ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ద్విచక్ర వాహనాలను జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను మత్స్యకార కుటుంబాలు ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతమై ప్రతి ఒక్కరూ మరింత అభివృద్ధి చెందాలన్నారు. చేపలు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని, చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. కొత్త సాంకేతికను ఉపయోగించుకుని చేపలను నాణ్యతగా తయారు చేసుకోవాలని, వాటికి మార్కెట్ ధర కూడా బాగుంటుందన్నారు. రైతులు ముందుకు వస్తే మరిన్ని మినీ ఫిష్ ఔట్ లెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తద్వారా మంచి లబ్ధి పొందవచ్చని అన్నారు. ప్రస్తుతం ఫిష్, ఫ్రాన్స్ లను డిమాండ్ కు అనుగుణంగా మరింత ఉత్పత్తి చేయాలన్నారు. ఈ విషయమై వినియోగదారులకు అవగాహన తీసుకురావాలని, డిమాండ్ ఉన్న ఫిష్ ను తయారు చేసేందుకు ముందుకు రావాలన్నారు. స్థానిక రకాలను మరింత ప్రోత్సహించాలన్నారు. ఫ్రాన్స్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని, ఫిష్ ఫాండ్స్ ని ప్రైవేట్ గా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మత్స్యకారులు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ, మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అందించాలని అమ్మఒడి పథకం కింద రూ.15,000 అందిస్తున్నారని, విద్యా, వసతి దీవెన పథకాలను సీఎం అమలు చేస్తున్నారని, ఆయా పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులను కూడా మత్స్యకార కుటుంబాలు ఉపయోగించుకోవాలన్నారు
ఈ సందర్భంగా 75,000 విలువ చేసే 6 ద్విచక్ర వాహనాలను 40 శాతం సబ్సిడీతో చేపలు అమ్ముకునే లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పంపిణీ చేశారు. అనంతరం చిన్న తరహా చేపల మార్కెట్ నిర్వహిస్తున్న లబ్ధిదారులకు మెమొంటో లను వారు అందించారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ఎఫ్డిఓలు ఆషిఫ్, లక్ష్మీనారాయణ, ఫక్కిరప్ప, పెద్దబాబునాయుడు, మత్స్య శాఖ సిబ్బంది షెహిన్ ఖాన్, మత్స్య సహకార సంఘాల మాజీ అధ్యక్షులు అంకె పోతన్న, బాల నరసింహులు, గోవర్ధన్, మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.