న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆయన నివాసంలోనే విచారించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్‌ను సీజ్ చేశారు. తొలుత దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన తర్వాత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేజ్రీవాల్‌ను దాదాపు రెండు గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు, నేతలు చేరుకుని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఇప్పటికిప్పుడు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.