సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉండగా, ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. అయితే, ఎట్టకేలకు ఈసీ నుంచి ఇవాళ అనుమతి రావడంతో రాష్ట్ర క్యాబినెట్ భేటీకి మార్గం సుగమమైంది. ఈసీ నుంచి అనుమతి రాకపోతే, మంత్రి వర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఆ అవసరం లేకుండానే కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. అయితే, తెలంగాణ క్యాబినెట్ భేటీకి కొన్ని షరతులు విధించింది. జూన్ 4వ తేదీ లోపు నిర్వర్తించాల్సిన అత్యవసర పనులపై మాత్రమే ఈ సమావేశంలో చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చించారదని తేల్చిచెప్పింది.