రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టమా?: జగన్ పై దేవినేని ఉమ పైర్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజభవనాల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక చట్టమే చేశాడంటూ టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. సొంత ప్యాలస్ ల రక్షణకు వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంట్లో ఉన్నపుడు ఏకంగా 986 మందితో సెక్యూరిటీ పెట్టుకున్నాడని, బయటకు అడుగు పెడితే దానికి మూడు రెట్లు అధికంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. దారిపొడవునా పరదాలు కప్పి, అడుగడుగుకో పోలీస్ ను నిలబెట్టి రాష్ట్రంలో పర్యటించే వాడని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏర్పాట్ల కోసం ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేశాడని దేవినేని ఉమ మండిపడ్డారు.తన కుటుంబం, తన రాజభవనాల రక్షణకోసం ప్రత్యేక చట్టం చేయడంతో పాటు తన నివాస పరిసరాల్లో 48 చెక్ పోస్టులు, రిక్టాట్రబుల్ గేట్లు, బూమ్ బారియర్లు, టైర్ కిల్లర్లు, బోలార్డ్స్ లాంటి విస్తు గొలుపే సాధనా సంపత్తిని సమకూర్చుకున్నాడని విమర్శించారు. తన రక్షణ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్.. తన తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో జరిగిన అత్యాచారం, అరాచకాలను మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల భద్రత గాలికి వదిలేసి వారి సొమ్ముతో విలాసాలు అనుభవించే జగన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కన్నా పెద్ద పెత్తందారి అని దేవినేని ఉమ విమర్శించారు.

