గొల్లప్రోలు : నగర పంచాయతీ పరిధిలో నిర్వహించే అభివృద్ధి పనులకు సంబంధించి కమీషనర్ రవికుమార్ ప్రోటోకాల్ పాటించకుండా చైర్ పర్సన్ ను, కౌన్సిలర్లను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ సమావేశం శనివారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో అజెండాలోని అంశములను చదువుతుండగా పలువురు కౌన్సిలర్లు అడ్డుకొని కమిషనర్ ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదో తెలపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పట్టణ పరిధిలో వీధి దీపాలు ఏర్పాటుకు జూలై నెల సమావేశంలో తీర్మానం చేసామని, గత ఏడాది కాలం నుండి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆయా సమావేశాలలో కోరుతూ వచ్చామన్నారు. ఇటీవల వీధి దీపాలు కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నప్పుడు కౌన్సిలర్లకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని నిలదీశారు.10వ వార్డు కౌన్సిలర్ మొగలి దొరబాబు మాట్లాడుతూ ప్రోటోకాల్ పై కమీషనర్ కు అవగాహన లేదని, ఉద్దేశపూర్వకంగానే కౌన్సిలర్లను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.4వ వార్డు కౌన్సిలర్ బెందుకుర్తి సత్తిబాబు మాట్లాడుతూ స్థానికంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కలసి మెలసి ఉంటారని, అటువంటి వారి మధ్య పార్టీ పరంగా గొడవలు సృష్టించేందుకు కమిషనర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్లతో పని లేనప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏముందని మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. సీనియర్ కౌన్సిలర్ గంటా అప్పలస్వామి మాట్లాడుతూ కమీషనర్ కు పట్టణ సమస్యలపై అవగాహన లేదని, కనీసం ఆయా వార్డులలో ఎప్పుడూ పర్యటించలేదని, కౌన్సిలర్లు ఎవరో కూడా తెలియదని విమర్శించారు. చైర్ పర్సన్ భర్త, కౌన్సిలర్ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ చైర్ పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో కూడా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కమిషనర్ చైర్ పర్సన్ ను పిలవలేదన్నారు. కౌన్సిల్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఎంతమంది వస్తే కోరం పూర్తవుతుందో కూడా కమీషనర్ కు అవగాహన లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని పిలుపునిస్తే అధికారులు వేరే విధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. కాగా కౌన్సిల్ తో సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కమిషనర్ రవికుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ చైర్ పర్సన్ మంగతాయారుకు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం సమావేశపు హాల్లో బైఠాయించి కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కమీషనర్ ను సస్పెండ్ చేయాలంటూ కౌన్సిలర్ల ధర్నా
ప్రోటోకాల్ పాటించకుండ కౌన్సిలర్ల ను అవమానిస్తున్న కమీషనర్ రవి కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చైర్ పర్సన్ మంగ తాయారుతో సహా కౌన్సిలర్లు నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నగర పంచాయతీ సమావేశం బహిష్కరించిన అనంతరం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమీషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ లు తెడ్లపు అలేఖ్యరాణి, గంధం నాగేశ్వరరావు, కౌన్సిలర్లు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి,గొల్లపల్లి అచ్చుమాంబ, బావిశెట్టి జ్ఞానేశ్వరి, దాసం దేవి, దమ్మాల లక్ష్మి, వడిసెల వరలక్ష్మి,సింగం నాగేశ్వరరావు, కో ఆప్షన్స్ సభ్యుడు ఈరుగుల ఏసు తదితరులు పాల్గొన్నారు.