Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలునా చెల్లి రోజమ్మ… మనసు వెన్న

నా చెల్లి రోజమ్మ… మనసు వెన్న

పుత్తూరులో సీఎం జగన్ ప్రసంగం

పుత్తూరు:సీఎం జగన్ నేడు నగరి నియోజకవర్గం పుత్తూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఎండ మండిపోతున్నా ప్రజలు భారీగా తరలిరావడం ఉత్సాహం కలిగిస్తోందని, రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. మూడ్రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామం అని అభివర్ణించారు. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు మాత్రమే కాదని… ఇంటింటా అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు అని పేర్కొన్నారు. మీ బిడ్డ జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ నిలిచిపోతాయని అన్నారు. చంద్రబాబు సాధ్యంకాని హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన విషయం గుర్తించాలని స్పష్టం చేశారు. 130 సార్లు బటన్ నొక్కి వివిధ పథకాల ద్వారా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, చేతుల్లోకి నేరుగా వెళ్లిపోతున్నాయని చెప్పారు. గతంలో ఇలా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. “రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న ఉద్యోగాల సంఖ్య 4 లక్షలు. మరి మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలో 2.30 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత చేకూర్చాం. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం అమలు చేశాం. మేం తీసుకువచ్చిన పథకాలు గతంలో ఎప్పుడూ లేవు.చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేశానని, మూడు సార్లు ముఖ్యమంత్రినని చెప్పుకుంటూ ఉంటాడు. మరి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన ఒక్క మంచి పని అయినా గుర్తుకువస్తుందా? దీన్ని బట్టే ఆయన పాలన ఎలాంటిదో అర్థమవుతుంది. చంద్రబాబుకు అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు… అధికారం ఒక్కసారి దక్కితే చేసే మాయలకు 2014 నాటి కూటమి మేనిఫెస్టోనే నిదర్శనం. చంద్రబాబు సంతకం చేసిన ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపించారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. కానీ, వారి మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటైనా అమలు చేశారా? మరి ఇదే చంద్రబాబు ఇప్పుడు కేజీ బంగారం అంటున్నాడు, బెంజి కారు అంటున్నాడు. సూపర్ సిక్స్ అంటున్నాడు, సూపర్ సెవెన్ అంటున్నాడు… ఇలాంటి వ్యక్తులను నమ్మవచ్చా అన్నది ప్రజలే ఆలోచించుకోవాలి. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి రావాలన్నా… బటన్లు నొక్కడం, బటన్లు నొక్కగానే నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు రావాలన్నా… పేదల భవిష్యత్ మారాలన్నా, లంచాలు, వివక్షత లేని పాలన కావాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా… ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీదు రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు… ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. నా చెల్లి రోజమ్మ నగరి నుంచి పోటీ చేస్తోంది… మంచి మనసున్న మనిషి… మంచి చేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం, నమ్మకం నాకున్నాయి. అప్పుడప్పుడు మాట కొంచెం కటువు గానీ, మనసు మాత్రం వెన్న. నా చెల్లిని ఆశీర్వదించాల్సిందిగా మీ బిడ్డ ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ప్రాధేయపడుతున్నా. ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప ఉన్నారు. మంచివాడు, సౌమ్యుడు, భీష్మాచార్యుడి వంటి వారు. మీ చల్లని దీవెనలు ఆయనపై ఉంచాలని ప్రార్థిస్తున్నా” అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article