Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు : సీఎం జగన్

ఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు : సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్ లో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తనను గద్దె దింపేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనించాలని అన్నారు. ఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని, జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమే తప్ప జరిగేదేమీ ఉండదని, చంద్రబాబు గత చరిత్రను చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు సార్లు సీఎంను అంటాడు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు… మరి చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. తాము ఈ ఐదేళ్ల కాలంలో అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పాఠశాలల్లో గోరుముద్ద, పిల్లలకు ట్యాబ్ లు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్ లు, విద్యాకానుక, అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్, 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఆసరా, చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, రైతన్నకు పెట్టుబడి సాయం, పగటిపూట ఉచితంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆర్బీకే వ్యవస్థలు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వారికి వాహన మిత్ర సాయం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, చేదోడు వాదోడు పథకం, న్యాయవాదుల కోసం లా నేస్తం, రూ.25 లక్షల వరకు పెంపుతో ఆరోగ్య శ్రీ, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, 60-70 ఇళ్లకు ఓ వాలంటీరు, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, ఇంటి వద్దకే రేషన్ బియ్యం… ఈ పథకాలన్నీ మేం అమలు చేస్తున్నాం అని సగర్వంగా చెప్పుకోగలమని సీఎం జగన్ వివరించారు. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని, అందుకు నిదర్శనం 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోయేనని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేస్తున్న చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి ఇప్పుడు బటన్ లు నొక్కిన సొమ్ము కూడా రాకుండా అడ్డుకుంటున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు. తానేమీ ఎన్నికలు వస్తున్నాయని ఇప్పటికిప్పుడు బటన్ నొక్కలేదని, గత ఐదేళ్లుగా బటన్లు నొక్కుతూనే ఉన్నానని వెల్లడించారు. అందుకే చంద్రబాబు కుట్రలకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.సైకిల్ కు బాగా తుప్పు పట్టిపోయిందని, అందుకే ఢిల్లీ నుంచి మెకానిక్ లను పిలిపించుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పూర్తిగా డ్యామేజి అయిన సైకిల్ ను తాము బాగు చేయలేమని ఢిల్లీ మెకానిక్ లు తేల్చి చెబితే, పిచ్చిచూపులు చూస్తున్న చంద్రబాబు బెల్ కొట్టడం మొదలుపెట్టాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ బెల్ పేరే మేనిఫెస్టో అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article