ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉంటూ, రెండు రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ ముఖ్య నాయకులతో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, మరియు కొత్త నాయకులను పార్టీలోకి ఆహ్వానించడంపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రతి 15 రోజులకు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి, ఈ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.ఇదే సమయంలో, పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్‌లో ఉన్నారు, తన నివాసంలో జనసేన నేతలతో సమావేశమవుతున్నారు. వాస్తవానికి ఈరోజు అమరావతికి వెళ్లాల్సిన పవన్, కొన్ని కారణాల వల్ల తన షెడ్యూల్ మార్చుకున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి అమరావతికి బయల్దేరనున్నారు.