మోడీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టిన సిఐటియు
హిందూపురంటౌన్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేయనున్నట్లు సిఐటియు నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో చేపట్టిన నిరసనలు విజయవంత మయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ని ఇందిరా పార్క్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్మికులు ప్రదర్శన నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్ లో మానవహారంగా ఏర్పడి దాదాపు 30 నిమిషా ల పాటు నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ మాట్లాడుతూ ,కేంద్ర ప్రభ త్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకుని వచ్చి వ్యవసాయ రంగాన్ని రైతులకు అప్పగించే చట్టాలను రద్దు చేయాలన్నారు. పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని 2021 విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని ,రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రై తు సంఘాలు ఆగ్రహించాయి. దీంతో రైతులు దేశ వ్యాప్తంగా మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీలో రైతులు శాంతియుతంగా ఆందోళన చేయడానికి పూనుకుంటే వారిపై బాష్ప వాయు ప్రయోగం చేయడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోడీ అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. టిడిపి, జనసేన పార్టీలు మోడీకి కొమ్ము కాసే విధానాన్ని విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న కార్పొరేట్ ప్రభుత్వం కర్షకులపై కర్కశంగా ప్రవర్తించడం తగదన్నారు. దీంతో పాటు కార్మిక చట్టాలను సైతం కేంద్ర ప్రభుత్వం కాల రాస్తున్నదన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలను ఉదృతంగా చేస్తామన్నారు. అదే విధంగా పంజాబ్ రైతుల ఆందోళనకు మద్దతుగా సిక్కుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు ఖండించారు. కార్యక్రమాల్లో సిఐటియు రాజప్ప, ఆటో సంఘం రామక్రిష్ణ, మున్సిపల్ సంఘం జగదీష్, రామక్రిష్ణ, ఆనంద్, గురునాధ్, అంగన్వాడీ సంఘం లావణ్య, శిరీష, ఆశాసంఘం మమత, కల్పన, ఎన్ఎస్ఐ సంఘం బాబ వలీతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. సిక్కుల ఆందోళణలో పలవీందర్ సింగ్, హార్మేందర్ సింగ్, భగవాన్ సింగ్, స్థానిక ముస్లీం నగరా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.