మామిళ్ళగూడెం గ్రామంలో విషాదం చింతూరు:మండల కేంద్రం చింతూరు లోని కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాలలో 7.వ తరగతి చదువుతున్న శ్యామల లక్ష్మీపార్వతి (13) అనే గిరిజన విద్యార్థిని అనారోగ్యంతో చికిత్స పొందుతు మృతి. ఇందుకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మామిళ్ళగూడెం గ్రామానికి చెందిన బాధిత విద్యార్థిని, చింతూరు కస్తూరిబా పాఠశాలలో 7.వ తరగతి చదువుతుంది. అయితే సదరు బాలికకు హాస్టల్ లో ఉండగా తీవ్రమైన ఆయాసం వస్తుండటంతో, బాధిత బాలిక మేనత్త కూతురు విషయాన్ని శనివారం సాయంత్రం లక్ష్మీపార్వతి తల్లి రాములమ్మకు చారువాణి ద్వారా సమాచారం అందించింది. తన కూతురు ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందుకున్న తల్లి రాములమ్మ ఆదివారం ఉదయం కస్తూరిబా పాఠశాలకు చేరుకుని, తమ కుమార్తెను తనాతో పాటు పంపించాల్సిందిగా హాస్టల్ నిర్వాహకులను కోరింది. విద్యార్థినిని తల్లితో పంపించేందుకు తొలుత అంగీకరించని, హాస్టల్ ఇన్ చార్జి, చివరకు పంపించారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న, తన కుమార్తెను తల్లి రాములమ్మ నేరుగా చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళింది. బాధిత బాలికను పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి బాగోలేదని, మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వృధా అయిన గోల్డెన్ టైం …….. . వైద్య పరిభాషలో చెప్పుకునే గోల్డెన్ టైం (చికిత్సకు అవసరమైన విలువైన సమయం ) విద్యార్థిని విషయంలో వృధా అయ్యింది. పాపకు మెరుగైన చికిత్స అందించటం కోసం భద్రాచలం తరలించాల్సిన సమయంలో, చేతిలో చిల్లిగవ్వ లేని తల్లి రాములమ్మ తన కూతురిని అదే రోజు సాయంత్రం తన స్వగ్రామానికి మామిళ్ళగూడెం తీసుకొని వెళ్ళింది. తొలుత హాస్టల్ లో,ఆతరువాత ఇంటి వద్ద చికిత్సకు అవసరమైన విలువైన సమయం వృధా అయ్యింది. ఇంటికి వెళ్ళిన రాములమ్మ కొంత డబ్బులు కూడ బెట్టుకొని,అదే రాత్రికి మరోసారి చింతూరు ఆస్పత్రికి తన బిడ్డను తీసుకొని వెళ్ళింది.బాధిత బాలికను పరీక్షించిన వైద్యులు రాత్రికి,రాత్రే 108 వాహనంలో భద్రాచలం తరలించారు. సోమవారం ఉదయం పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికను ఐసియూ లో పెట్టి చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత, విద్యార్థిని లక్ష్మీపార్వతి తుది శ్వాస విడిచింది. బాలిక పార్థివ దేహాన్ని సోమవారం స్వగ్రామం మామిళ్ళ గూడెం తరలించారు. బాధిత కుటుంభానికి నేతల పరామర్శ……. అనారోగ్యంతో చికిత్స పొందుతు మృత్యువాత పడిన కస్తూరిభా గాంధీ గురుకుల విద్యార్థిని,శ్యామల లక్ష్మీపార్వతి పార్థివ దేహాన్ని సోమవారం బిజెపి నాయకులు డివివి రమణ (చిట్టిబాబు), జనసేన నాయకులు మడివి నెహ్రులు సందర్శించి, విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంభాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.