Saturday, September 13, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ అక్రమాలపై సీఐడీ విచారణ

ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ అక్రమాలపై సీఐడీ విచారణ

ప్రజలు ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదు

మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచి పేద వాడిని దోచుకున్న గత ప్రభుత్వ విధానానికి స్వస్తి

సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ :- సీఎం చంద్రబాబు నాయుడు

ఎక్సైజ్ శాఖపై సీఎం సమీక్ష

అమరావతి :- ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నకారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే సీఐడీ విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని ఆదేశించారు. ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని…దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు. ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. మద్యం సేవించేవారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ…తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత మద్యం లేకుండా చేస్తే కొంత వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందని అన్నారు. నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారని అన్నారు. ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని…ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు వచ్చిన ఆదాయాన్నంతా పేదలు మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. రేట్లు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర అధ్యయనం తరువాత కొత్త మద్యం విధానం రూపొందించాలని ఆదేశించారు. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త మద్యం విధానంపై వచ్చే ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని, గంజాయి విషయంలో కూడా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మద్యం విధానం ఆదాయం కోణంలో కాకుండా….అవకతవకలకు అవకాశం లేని విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article