మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలకు సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఉచిత ఇసుక విధానంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తుండటంతో, ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావడమే రాబోయే ఎన్నికల్లో గెలుపుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.ఇకపోతే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై విచారణలు జరుగుతున్నాయని, ఎవరైనా ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. కూటమి ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో చంద్రబాబు అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై కూడా మాట్లాడారు. అమరావతికి కేంద్రం నుండి రూ. 15 వేల కోట్లు కేటాయించారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.