ప్రతివాదులకు నోటీసులు పంపించిన న్యాయమూర్తి
ఏలూరు జిల్లా :డీజే సౌండ్ సిస్టం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం వ్యాప్తి చెంది ప్రజలు ప్రజల మానసిక స్థితి దెబ్బతింటుందని, వెంటనే డీజే సౌండ్ సిస్టమ్ ను జిల్లా వ్యాప్తంగా నిషేధించాలని ప్రముఖ సీనియర్ న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు ఏలూరు జిల్లా కోర్టులో ఫ్రీ లిటిగేషన్ కేసుగా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏలూరు వారు ప్రతివాదులైన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21వ తేదీన డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి వారికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు మాట్లాడుతూ ఈ డిజె సౌండ్ సిస్టమ్ 5 నిమిషముల పాటు వింటే 50 నుండి 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వస్తుందని అది ఒక వ్యక్తి యొక్క గుండెను ప్రభావితం చేస్తుందన్నారు. అలాగే వ్యక్తి యొక్క గుండెపై హానికరమైన ప్రభావం చూపుతుందిని, 60 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని వినినట్లయితే మనుషులు వినికిడి శక్తిని కూడా కోల్పోతారన్నారు. ఈ అధిక డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉపయోగించడం వల్ల వ్యక్తి యొక్క రక్తప్రసరణపై కూడా ప్రభావం చూపుతుందన్నారు.
ఏలూరు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రారంభోత్సవాలకు, ఊరేగింపులకు, జాతర్లకు, గ్రామోత్సవాలకు, వివిధ ఫంక్షన్లకు డిజె సౌండ్ సిస్టమ్ను ఉపయోగించడం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం వెదజల్లుతుందన్నారు. డీజే సౌండ్ సిస్టం వల్ల విలువడే అధిక శబ్దం వల్ల ప్రజలు గుండె జబ్బుల బారిన పడుతున్నారని, తెలియని పరిస్థితిలో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రక్త ప్రసరణపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, వినికిడి లోపం ఏర్పడుతుందని, వృద్ధులు, హుద్రోగులు, చిన్నపిల్లలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. డీజే సిస్టంలో భారీ వాహనాల్లో ఉంచి ఒక చోట నుంచి మరోచోటకు భారీ శబ్దాలతో తరలించడం కారణంగా ఎలక్ట్రికల్ వైర్లు తగిలి పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు. అంతేకాకుండా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న డీజే సౌండ్ సిస్టమ్ ను జిల్లా వ్యాప్తంగా నిషేధించాలని లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టులో ఫ్రీ లిటిగేషన్ కేసు దాఖలు చేసినట్లు న్యాయవాది చిక్కా భీమేశ్వరావు తెలిపారు.