వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్‌కు బిగ్ షాక్ తగిలింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా..శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం అందించారు.అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోరారు. ఇమ్మిగ్రేషన్ సమయంలో అవినాష్‌పై లుకౌట్ నోటీసులు ఉండటంలో అప్రమత్తమైన పోలీసులు అవినాష్ దుబాయ్ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక అవినాష్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితోపాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగిన దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు. అంతకుముందు మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఈ దాడి వెనుక అవినాష్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఇందులో భాగంగానే ఆయనపై పలు కేసు నమోదయ్యాయి.దేవినేని అవినాష్ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, అంతకుముందు 2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున దేవినేని అవినాష్ విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై దూకుడుగా వ్యవహరించిన ఆయన టీడీపీ కార్యాలయాలపై దాడిలో ప్రధాన పాత్ర పోషించారనే అనుమానాలు ఎదుర్కొంటున్నారు.

