కార్మికుల శ్రమే చెత్త బండికి దిక్కు
ఇబ్బందుల్లో పురం ప్రజలు
హిందూపురంటౌన్:కంప్యూటర్ యుగంలో కూడా పారిశుద్ధ్య కార్మికుల బతుకుల్లో మార్పు రావడం లేదు.. పది గజాల దూరం కూడా కారులో, బైకుల్లో ఆటోల్లో వెళుతున్న ఈ రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులు మాత్రం కాళ్లు అరిగేలా రెక్కలు.. ముక్కలు వేసుకుంటూ.. తోపుడు బండిని నెట్టుకుండా.. చెత్తను సేకరించాల్సిన దుస్ధితి నెలకొంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా హిందూపురం ఎంపిక శ్రేణి మున్సిపాలిటీగా గుర్తింపు పొందినప్పటికీ కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్మికుడు శ్రమ లేనిదే చెత్త బండి ముందుకు కదలడం లేదు. కార్మికుల పరిస్థితి చూసిన ప్రజలు అయ్యో పాపం అంటున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినాపారిశుద్ధ్య కార్మికులకు తిప్పులు తప్పడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన క్లాస్ కార్యక్రమం అదిలోనే ఫ్లాప్ కావడంతో. లక్షలు వెచ్చించి ఇంటింటా చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన వాహనాల నిర్వ హణ చేత కాక పోవడంతో ఆ వాహనాలన్ని మూలనపడ్డాయి.గత టిడిపి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర పేరుతో వాహనాల కొనుగోలుకు కోట్లాది రూపాయాలు వృథా చేస్తే.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాస్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ కోసం కోట్లాది రూపాయాలు వెచ్చించి వాహనాలు కోనుగోలు చేశారు. ఈ కార్యక్రమాన్ని 2022 ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటిశచెత్త సేకరణ ప్రారంభించింది. ఈ వాహనాలకు డ్రైవర్లను నియమించింది. ఒక్కొక్క వాహన డ్రైవరకు రూ. 18,500లు, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి విధుల్లో తీసుకుంది. హిందూపురం పుర పాలక సంఘానికి 26 వాహనాలు కేటాయించింది. నిర్వహణ బాధ్యతను కడప జిల్లాకు చెందిన రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ వాహనాలతో ప్రతి రోజు అధికారులు సూచించిన ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. మొదటి నెల డ్రైవర్లకు రూ. 8700లు ఇచ్చారు. గత ఏడాది నుంచి నెలకు రూ. 10,118లు చెల్లిస్తున్నారు. మిగిలిన రూ. 8వేలు ఎక్కడికి వెళుతోంది తెలియడం లేదు. ఇచ్చే అరకొర వేతనాలు సైతం ప్రతి నెలా ఇవ్వక పోవడంతో డ్రైవర్లు వాహనాలను నిలిపి నిరసన తెలిపారు. అయినప్పటికి అటు పాలకులు గాని… ఇటు అధికారులు గాని స్పందించక పోవడంతో గత ఐదు నెలలుగా క్లాత్ ఆటోలు మూలను పడ్డాయి. అయితే అప్పటికే మూలన పడేసిన చెత్త బండ్లను అధికారులు నా కనీసం మరమ్మత్తు సైతం చేయకుండా కార్మికులకు చెత్త బండ్లను ఇచ్చి చెత్త సేకరణ చేయాలని ఆదేశించారు. కనీసం రిక్షాలు సైతం లేని చెత్త బండ్లను తోసుకుంటూ చెత్తను కార్మికుల ఇంటింటా
సేకరిస్తున్నారు.
ప్రస్తుతం కార్మికుల పరిస్థితి ఇది…

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సెలక్షన్ గ్రేడ్ హోదా కలిగిన హిందూపురం పురపాలక సంఘంలో శాశ్వత ప్రాతిపదికన కార్మికులు 66, కాంట్రాక్టు కార్మికులు 220 ఉంటే అందులో ముగ్గురు మృతి చెందారు. 6 నుంది పదవీ విరమణ పొందారు. మిగిలిన 209 మంది విధులు నిర్వహిస్తున్నారు. కఠిన సమయంలో రోజు వారీ వేతనంతో అపుట్ సోర్సింగ్ కింద మరో 85 మందిని తీసుకున్నారు. మొత్తం 360 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కార్మికుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికి ఉన్న కార్మికులతోనే రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేయించడంతో పాటు ఇంటింటా చెత్త సేకరణ చేయిస్తున్నారు. దీంతో కార్మికులు వేకువ జామున 6 గంటల నుంచి కాళ్లు అరిగేలా చెత్త బండిని తోసుకుంటూ బుగ్గలు నొప్పులు పుట్టేటట్టు విజల్ వేస్తూ చెత్తను సేకరించి ఒక చోటకు చేర్చుతారు. దీనిని మరో కార్మికుడు ట్రాక్టర్ లేదా కంప్యాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తారు. చెత్త సేకరణ పూర్తి అయిన వెంటనే కార్మికులు తిరిగి రోడ్డు, మురుగు కాలువలు శుభ్రం చేయడం వలన మోకాళ్లు నొప్పులు, బండిని తోయడం వలన కండరాల నొప్పులు వస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకుని ఇంటింటి చెత్త సేకరణను బలోపేతం చేసేందుకు మూలనపడ్డ వాహనాలను ప్రజలకు అందుబాటులో తెచ్చి కార్మికులకు ఒకింత ఉపశమనం కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.