కల్లాల నుండే ధాన్యం కొనుగోలు చేయాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ వినతి
ఏలూరు :రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానాన్ని రూపొందించాలని, కల్లాలు నుండే ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు.
సోమవారం సి ఆర్ రెడ్డి కాలేజి ఆడిటోరియంలో జరిగిన ధాన్యం బకాయి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ పంట పండించడానికి కంటే పంట అమ్ముకోవడానికి రైతు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటను రక్షించుకునేందుకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేక అన్నదాత నష్టపోవాల్సి వస్తుందన్నారు. సామూహిక కల్లాలు, గ్రామీణ ప్రాంతాలలో పంట నిల్వ చేసుకునే షెడ్లు నిర్మాణం చేయాలని,తార్ఫాలిన్లు సబ్సిడీపై అందించాలని కోరారు. పంట సాగు చేస్తున్న కౌలు రైతుల పేర్లతోనే ధాన్యం కొనుగోలుచేయాలని,ఈ -క్రాఫ్ లో పేర్లనే నమోదు చేయాలన్నారు.తేమ శాతం వంటి నిబంధనలను సడలించాలన్నారు. రైతు నుండి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగమే తీసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో నిర్ణయించిన తేమశాతం, తూకం ఆధారంగా మిల్లు వద్ద ధాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. నాణ్యమైన గోనె సంచులు అందించాలన్నారు. రైతు ధాన్యం 48 గంటల్లో సొమ్ములు చెల్లించేలా ముందుగా తగు నిధులు కేటాయింపు చేయాలన్నారు. ధాన్యం రవాణాకు రైతుల ఎడ్ల బండ్లను అనుమతించాలన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కారానికి అన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన రబీ ధాన్యం బకాయిలు పూర్తిగా రైతులకు చెల్లించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు పలువురు రైతులు పాల్గొన్నారు.

