ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రాష్ట్రం కోసం కాకుండా సీఎం జగన్ కోసం పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. రాష్ట్ర డీజీపీని మార్చగానే జగన్ భయపడుతున్నారని.. అధికారులు ఎవరుంటే మీకెందుకని ప్రశ్నించారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు బలవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం తనకు లేదంటూ జగన్ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. జగన్ అవినీతి గురించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడారని అన్నారు. జగన్ స్కాంల గురించి బీజేపీ నేతలు వివరిస్తున్నారని చెప్పారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి అధికారులను మారుస్తున్నారని అంటున్నారని…. 2019 ఎన్నికల్లో మీరు ఈసీపై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వడానికి కూడా జగన్ వద్ద డబ్బులు లేవని అన్నారు. పెన్షనర్ల మరణాలకు జగనే బాధ్యత వహించాలని చెప్పారు.

