అమరావతి:టీడీపీ, జనసేన తొలి జాబితా ప్రకటన నేపధ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేనకు 24 సీట్లేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పల్లకి మోయడానికి తప్పా పావలా వంతుకు కూడా పనికిరారని టీడీపీయే తేల్చేసిందని, ఛీ పవన్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా టీడీపీ, జనసేన సీట్ల పంపకంపై మాట్లాడారు. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు, పవన్ చెరొక మాట మాట్లాడుతున్నారన్నారు. అసలు పొత్తులు కుదిరాయా? లేక పొత్తులు కుదిరినట్లు నటిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ..చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మగా మారారన్నారు. కాపులకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు.