ఆల్ ది బెస్ట్.. పరీక్షలంటే భయమొద్దు..
- ఆత్మస్థైర్యం..విజయానికి చిహ్నం
- స్వర్ణాంధ్ర @ 2047 ఆవిష్కరణలో నున్న హైస్కూల్ విద్యార్థులతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాటామంతి
ఏమ్మా బాగున్నారా.. ఏం చదువుతున్నారు.. ఎక్కడ నుంచి వచ్చారు.. అంటూ విజయవాడ రూరల్ మండలం నున్నలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్టేడియం ఆవరణలో ప్రత్యేకంగా పది సూత్రాలు ఒక విజన్ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు సందర్శించారు. విజన్ డాక్యుమెంట్ విడుదలకు ముందు స్టాళ్లను సందర్శించిన వారు అక్కడ పది సూత్రాలు ఒక విజన్ స్టాల్‌లో నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి స్టాళ్లలో నున్న హైస్కూల్ పదో తరగతి విద్యార్థినులు గాజుల సంధ్య, పానకాల భవ్యశ్రీతోపాటు పటమట జీడీఈటీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని జ్ఞానప్రసూనతో కొద్దిసేపు వారు మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు, ఏం చదువుతున్నారని ప్రశ్నించగా, తాము నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు సంధ్య, భవ్యశ్రీ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 17వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలపై చంద్రబాబు వారిని ఆరా తీశారు. పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నామని, పాఠశాలలో ఉపాధ్యాయులు తమకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరీక్షలంటే భయం వేయడం లేదా అని ప్రశ్నించగా, ఏమాత్రం భయంలేదని విద్యార్థినులు సమాధానం ఇవ్వడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల గురించి అక్కడే ఉన్న విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా చంద్రబాబు ఆరా తీశారు. అనంతరం ఆ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమానికి వెళ్లారు. ఇదిలావుండగా, తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా చూడటంపై నున్న హైస్కూల్ విద్యార్థినులు సంధ్య, భవ్యశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల నున్న జిల్లాపరిషత్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థుల ప్రతిభను గుర్తించి కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సహకారం వల్లే తాము గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించిన విజన్ డాక్యుమెంట్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించడం భవిష్యత్‌లో తమకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సంధ్య, భవ్యశ్రీ వెంట పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ సూరపనేని రవి ప్రసాద్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు సుబ్బారావు ఉన్నారు.