టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60% పదవులు ఆ పార్టీవారికే, 30 జనసేనకు, మిగతా పోస్టులు బీజేపీకి
జనసేన ఎమ్మెల్యేలున్న చోటా ఇదే సూత్రం వర్తింపు
బీజేపీ సభ్యులున్న స్థానాల్లో ఆ పార్టీకి 50 శాతం.. మిగతావి టీడీపీ, జనసేనకు
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేనల్లో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు ఈ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్ పదవులపైనా అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. వీటి భర్తీపై మూడు పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి. 30 శాతం జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇస్తారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం పోస్టులు ఆ పార్టీకే. 30 శాతం పోస్టులు టీడీపీకి, 10శాతం బీజేపీ వారికి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50 శాతం పదవులు, మిగిలిన 50 శాతం టీడీపీ, జనసేనలకు దక్కుతాయని సమాచారం. జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన నాయకులను గుర్తు పెట్టుకుంటామన్నారు. ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని, పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యమివ్వాలని సృష్టం చేశారు. నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి, వారి వివరాలు పంపించాలని కోరారు. కాగా.. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై, ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు నాగబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే టీడీపీ, జనసేన నాయకులపై కేసులు పెట్టని వారిని, వారిని ఇబ్బందులకు గురి చేయని వారిని గుర్తించి, పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే చేర్చుకోవాలని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు కేసులు నమోదైన వారి వివరాలూ పంపించాలని కోరారు.