అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీకి వచ్చారు. ఈసారి ఆయన రాకకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. రెండున్నరేళ్ల క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు. ఇలాంటి కౌరవ సభలో తానుండలేనని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని 19 నవంబరు 2021న ప్రతినబూనారు.
అనుకున్నట్టే ఇటీవల ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి, నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అంతకుముందు చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినదించాయి.