కోటరామచంద్రపురంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి .
బుట్టాయగూడెం: ఈనెల 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కోటరామచంద్రపురం ఐ టి డి ఏ యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో జరగనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గిరిజన హక్కులపై అవగాహన కలిగించేందుకు ప్రతీ ఏటా ఆగష్టు, 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొంటారన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణలో ఎటువంటి పొరపాటు లేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కోటరామచంద్రపురంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల, కురసకన్నప్పగూడెం, రాజానగరంలలో కలెక్టర్ పర్యటించారు. కలెక్టర్ వెంట ఐటిడిఏ ఇంచార్జి ప్రాజెక్ట్ అధికారి జి. శ్రీనుకుమార్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె. అద్దయ్య , గిరిజన సంక్షేమం ఇంచార్జి డిడి పి. వి.ఎస్. నాయుడు, ఈఈ కుమార్, కార్యాలయ మేనేజర్ ప్రకాష్, ఇంచార్జి తహసీల్దార్ రమేష్, పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.

