హిందూపురంటౌన్: లేపాక్షి మాజీ మండల అధ్యక్షులు హనూక్, తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్ర దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సార్ అహమ్మద్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో హనూక్ లేపాక్షి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పాలనలోనే చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అన్సార్ అహ్మద్ పనిచేయడం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కి వచ్చిన తర్వాత వీరు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా సంజీవపురం స్టే పాయింట్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమను ఆకర్షించాయని ,అందుకోసమే తాము తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యసాయి జిల్లా వైకాపా అధ్యక్షులు నవీన్ నిశ్చల్, వైకాపా ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మలతోపాటు పలువురు పాల్గొన్నారు.