హిందూపురం టౌన్ :ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి, ఐదేళ్లు గడిచినా రాష్ట్రాన్ని కనీస స్థాయిలో కూడా అభివృద్ధి చేయలేదని హిందూపురం టిడిపి ఎంపి అభ్యర్థి పార్థ సారథి విమర్శించారు. గత 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఎన్నికల్లో ఎలా వస్తారని ప్రశ్నించారు. ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు నెరవేర్చ లేదన్నారు. మద్యపాన నిషేధం తుంగలో తొక్కాడన్నారు. వాసిరకం మద్యంతో 35 లక్షల మంది అనారోగ్యం పాల య్యారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. విద్యుత్ చార్జీలు 9సార్లు పెంచి 64 వేల కోట్లు భారం మోపాడన్నారు. వ్యవసాయ మీటర్ల పేరుతో రూ.15 వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సబ్ ప్లాన్ రూ. 1,14,664 కోట్ల నిధులను దారి మళ్లించి కమిషన్లు పంచుకున్నారని విమర్శించారు. భూములు, ఇసుక, గంజాయి, ఎర్ర చందనం తదితర వాటిలో జగన్, అతని ముఠా కలిసి రూ.8.23.600 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పి స్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి నేటికీ ఆచరణలోకి తీసు కురాలేదన్నారు. ఏపీలో ఆక్రమ ఇసుక రవాణా తో రూ.50 వేల కోట్లు లూఠీ చేశారన్నారు. ఇసుక లభించక ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్ధితిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నేడు సిమెంట్ ధరలతో ఇసుక పోటీ పడుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ , డీజిల్ రేట్లు ఆంధ్ర ఉన్నాయన్నారు. అందరికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఎత్తివేసి పేదల కడుపు కొట్టారన్నారు. అమ్మ ఒడిలో అన్యాయం చేశారని, చివరకు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రను చేశారన్నారు. ఇక ఉద్యోగులను విధుల పేరుతో వేధించడంతో పాటు వారికి ఇచ్చిన సిసిఎన్ రద్దు పై మాట తప్పడమే కాకుండా కనీసం టిఏ, డిఏలను సైతం ఇవ్వలేదన్నారు. ఇక అనంత అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను సైతం ఒక్కటి నెరవేర్చలేదన్నారు. మడమ తిప్పి మాట మార్చిన జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని బీకే ప్రశ్నించారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి జరగాలంటే చంద్ర బాబుతోనే సాధ్యం అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసగించి అక్రమార్కులకు పాల్పడుతున్న వైకాపా దొంగలకు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పార్థసారథి ప్రజలను కోరారు.ఈ సమావేశంలో స్థానిక టిడిపి నాయకులు జెవి అనిల్ కుమార్, గ్రీన్ పార్క్ నాగరాజు, అమర్నాథ్, భాస్కర్, చంద్రమోహన్, ఆనంద్ కుమార్ , నబీరసూల్ తదితరులు పాల్గొన్నారు.

