టిడిపి తోనే వెనుకబడిన వర్గాల అభివృద్ధి హిందూపురం టిడిపి ఎంపీ అభ్యర్థి పార్థసారథి
లేపాక్షి :-రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ప్రజల ఐక్యతే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష అని హిందూపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన లేపాక్షిలో ఆర్జెహెచ్ ఫంక్షన్ హాల్లో లేపాక్షి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బీసీ గర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర, హిందూపురం టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వెనుకబడిన వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయడమే కాక వారి అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ స్థానికేతరులను హిందూపురం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగిందని విమర్శిస్తున్నారన్నారు. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ స్థానానికి బెంగళూరుకు చెందిన ఒక మహిళను, పార్లమెంట్ స్థానానికి కర్ణాటక బళ్లారికి చెందిన మరో మహిళను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసిందని, వారు స్థానికేతర్లు కాదా అని పార్థసారథి ప్రశ్నించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి పార్టీలు సంయుక్తంగా, ఐక్యంగా ఎన్నికల బరిలో దిగుతున్నాయని, కచ్చితంగా జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెనుకబడిన వర్గాల వారు సమైక్యతతో ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బేవినహళ్లి ఆనంద్ , కిరికెర రాము, సిరివరం కృష్ణప్ప,లేపాక్షి ఆనంద్ కుమార్, వెంకటేష్, కొండూరు ప్రభాకర్ రెడ్డి, మారుతి ప్రసాద్, నాగలింగారెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, ఈడిగ రమేష్, ఎన్.బి.కె మూర్తి, టిఎన్ఎస్ఎఫ్ అభి, చిన్న ఓబన్న , డైరీ శ్రీరామప్ప, రవి లతోపాటు జనసేన నాయకులు బాలాజీ ,లోకేష్ లతోపాటు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన వెనుకబడిన వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

