బిజెపితో చేతులు కలిపిన కూటమి పార్టీలకు ఓటు వేస్తే ఇబ్బందులకు గురి చేస్తారు
గాజువాక: భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మైనార్టీలకు భద్రత ఉండదని వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర డివిజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు గాజువాక దారుల్ ఉలూమ్ ఇన్సాకియా మసీదులో కార్పొరేటర్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వై వి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలను చిన్నచూపు చూస్తూ వారి మనుగడకు భంగం కలిగించే విధంగా వివిధ చట్టాలను తీసుకువస్తున్న భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేన పార్టీలు చేతులు కలిపాయి అంటే, ముస్లిం వ్యతిరేక నిర్ణయాలకు ఈ రెండు పార్టీలు కూడా మద్దతు ప్రకటించినట్టే అయిందని సుబ్బారెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని, వారిని కంటికి రెప్పలా కాపాడుతోందని చెప్పారు. అందువలన వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవిధంగా ముస్లిం మైనార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి. అమర్నాథ్ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. వీరి విజయం కోసం అల్లాను ప్రార్థించాలని సుబ్బారెడ్డి కోరారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లింలంతా కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తారని అన్నారు. ముస్లింలు అధికంగా ఉన్న గాజువాక ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ముస్లింలకు గౌరవ స్థానం కల్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారని అందులో నలుగురు విజయం సాధించారని చెప్పారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో కూడా ముస్లింల గౌరవాన్ని మరింత పెంచే విధంగా ఏడుగురికి టికెట్లు ఇచ్చారని అమర్నాథ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వటం వలన వారి కుటుంబంలో ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉండడానికి అవకాశం కలిగిందని చెప్పారు. బిజెపితో కలిసిన కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలను వేధింపులకు గురిచేస్తారని అమర్నాథ్ చెప్పారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాజువాక వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా తన విజయానికి సహకరించాలని అమర్నాథ్ అభ్యర్థించారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోలగురువులు, దేవన్ రెడ్డి, తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య , ఉరుకూటి రామచంద్రరావు,దొడ్డి కిరణ్ ఎస్.ఏ.రెహమాన్, మంత్రి రాజశేఖర్, ఇమ్రాన్, గౌస్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు

