‘విజన్ విశాఖ’లో సదస్సు సీఎం జగన్
విశాఖ:విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళుతోందని అన్నారు. హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోందని వివరించారు. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని.. వైజాగ్‌లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90 శాతం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయన్నారు. అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్‌ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62 శాతం ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌లో 40 శాతం మాత్రమే ఉందన్నారు. తలసరి ఆదాయం కూడా తెలంగాణ లో 3.12 లక్షలు ఉంటే ఏపీలో 2.9 లక్షలు మాత్రమే ఉందన్నారు. సుదూర సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూల పాడు పోర్టులు అత్యంత వేగంతో నిర్మాణం అవుతూ ఉన్నాయన్నారు. బ్లూ ఎకానమీని పెంచే క్రమంలో 10 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం జరుగుతోందన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వుంటే నగరం అభివృద్ధి బహుముఖంగా జరుగుతుందన్నారు. బెంగలూరు, చెన్నై తరహాలో విశాఖ అభివృద్ధి చెందే అవకాశం వుందన్నారు.