రాజకీయ కుట్రలో భాగంగానే వివేకాను దారుణంగా హత్య చేశారని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ టికెట్ కోసం హతమార్చారని తెలిపారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కడప జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని చెప్పారు. ఆ సమయంలో జైల్లోని సీసీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. జైల్లో సీసీ కెమెరాలు పని చేసేలా చూసే బాధ్యత జైలు అధికారులదే అని చెప్పారు. కడప జైల్లో ప్రలోభాలపై ఎస్పీ, సీబీఐ ఎస్సీలకు లేఖ రాశానని తెలిపారు. తనను చైతన్య ప్రలోభాలకు గురి చేయడంపై మీడియాలను ఆశ్రయించాలని తన భార్యకు చెప్పానని అన్నారు. జైలు అధికారులు కూడా తనను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా తన భార్యను బెదిరించారని మండిపడ్డారు.