న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. సూర్యుడి మీద పరిశోధన కోసం నిర్మించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం రోజునే తనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని ఆయన తెలిపారు.అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్య లేదని క్యాన్సర్ నుంచి కోలుకున్నానని తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ లాంచ్ టైమ్‌లో కొన్ని హెల్త్‌ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఆ టైమ్‌లో అవేంటో తనకు క్లారిటీ లేదని సోమనాథ్ చెప్పారు. ఆ తరువాత మెడికల్, క్లినికల్ టెస్ట్ లు చేయించుకోగా.. ఆదిత్య ఎల్-1 లాంచ్రోజున వచ్చిన రిపోర్టులలో తనకు క్యాన్సర్ ఉన్నట్లు తేలిందన్నారు.ఈ వార్త తన ఫ్యామిలీ, సహోద్యోగులను పెద్ద షాక్‌కు గురిచేసిందని వివరించారు. ఇండియా మొదటి సన్ మిషన్ ఆదిత్య ఎల్1 తన ప్రయాణాన్ని 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించింది. అదే రోజున సోమనాథ్ క్యాన్సర్ బారిన పడినట్లు రిపోర్టులు వెల్లడించాయి. కడుపులో కణితి పెరిగిందని.. ఇది వంశపారంపర్యంగా వచ్చిన ఆరోగ్య సమస్య అని చెప్పారు. ఆ తర్వాత కీమో థెరపీ చేయించుకున్న ఆయన.. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి ఇస్రోలో తన విధుల్లో చేరారు. మొదట్లో చాలా భయపడ్డానని.. కానీ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, క్యాన్సర్ నుంచి బయటపడినట్లే అని తెలిపారు. అయితే తాను రెగ్యులర్ చెకప్‌లు, టెస్ట్‌లు, స్కాన్‌లు చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.