చిరంజీవి కెరియర్ తొలినాళ్లలో ఆయనను హీరోగా పెట్టి ‘కోతలరాయుడు’ సినిమాను నిర్మించారు తమ్మారెడ్డి భరద్వాజ . తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు. “చిరంజీవిని హీరోగా పెట్టి ‘కోతలరాయుడు’ సినిమాను నిర్మించడం మొదలుపెట్టాను. ఇప్పుడు చిరంజీవి మిత్రులుగా ఉన్నవాళ్లు .. అప్పట్లో నాకు మిత్రులు. వాళ్లంతా కూడా చిరంజీవి హీరో ఏమిటి? ఆయనను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? ఆయన తప్ప ఎవరూ దొరకలేదా? అన్నవారే. ” చిరంజీవి బాగా చేస్తున్నాడనే విషయం నాకు అర్థమైపోయింది. అయినా వీళ్లంతా ఎందుకు ఇలా అంటున్నారనే ఒక ఆలోచన ఉండేది. అయినా పంతంతో ఆ సినిమాను తీస్తూ వెళ్లాను. ఆ సినిమా ఎంత హిట్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఆ తరువాత చిరంజీవితో సినిమా చేయడం నాకు కుదరలేదు. ‘ఊర్మిళ’ సినిమాలో ఒక గెస్టు రోల్ చేయమని అడిగానుగానీ, ఆ ఆయనకి కుదరలేదు” అని చెప్పారు.