ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏకంగా 11,062 పోస్టులతో జారీ అయిన ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా.. ఎస్జీటీ పోస్టులు 6,508 ఖాళీలు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. 5,089 పోస్టులతో గతేడాది సెప్టెంబర్ 6న విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఫిబ్రవరి 28 రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాత పోస్టులకు కొత్త ఖాళీలను జోడిస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అయితే పాత దరఖాస్తులే చెల్లుబాటు అవుతాయని, కొత్త డీఎస్సీని పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు.