అమరావతి:మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు చర్యలు తీవ్రమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగమే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అక్రమ అరెస్టు అని చంద్రబాబు వివరించారు. శరత్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. శరత్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్డీఆర్ఐ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలు అని మండిపడ్డారు. ఏపీఎస్డీఆర్ఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా? అని చంద్రబాబు నిలదీశారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైసీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగం సభ్యులుగా పనిచేసే అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.<ఏపీఎస్డీఆర్ఐ ఎందుకు ఏర్పడింది, దాని అసలు లక్ష్యాలు ఏమిటి, మూడేళ్లుగా వాళ్లు పెట్టిన కేసులెన్ని, ఎవరెవరిపై కేసులు పెట్టారు? అనే వివరాలను ప్రభుత్వం బయటపెట్టగలదా? అని చంద్రబాబు సవాల్ చేశారు. టీడీపీ నేతలను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్టే… ఇప్పుడు ఏపీఎస్డీఆర్ఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని విమర్శించారు