లేపాక్షి: మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కల్లూరులో గత మూడు రోజులుగా అమ్మవారి ప్రతిష్ట కోసం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం భద్రకాళికా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తజన సందోహం మధ్యన కన్నుల పండువుగా సాగింది. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భద్రకాళికా అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం వేదమంత్రాల నడుమ వేద పండితులు నిర్వహించారు. అనంతరం గణపతి హోమము, నవగ్రహ హోమం ,మృత్యుంజయ హోమాలను నిర్వహించారు. అదేవిధంగా భద్రకాళీ సమేత వీరభద్ర హోమం ,చండీహోమాలను నిర్వహించి పూర్ణాహుతి పూజా కార్యక్రమం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది.
