బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో
రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు
విజయవాడ:విజయవాడలో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ విచ్చేశారు. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ జరిగింది. రాజధాని అంశంపై ఓ నాయకుడు అడిగిన ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించారు. ఏపీ రాజధాని అమరావతేనని మనం తీర్మానం చేశాం అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఏపీలో పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏలూరులో ఈ సాయంత్రం ఏపీ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో రాజ్ నాథ్ ప్రసంగిస్తూ… విపక్షాల విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. మూడో సారే కాదు, ఆ తర్వాత కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి మోదీ సర్కారు కృషి చేస్తుందని చెప్పారుఇప్పటివరకు తమ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడడడం బీజేపీ సర్కారు వల్లేన జరిగిందని వివరించారు.
బీజేపీ ఏం చెబుతుందో అదే చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు… జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాం… జమ్మూ కశ్మీర్ ను ఈ దేశంలో భాగం చేస్తాం అని చెప్పాం… ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తామని చెప్పాం… చేసి చూపించాం అని రాజ్ నాథ్ వివరించారు.ఈ క్రమంలో రాజ్ నాథ్ సింగ్ అయోధ్య రామ మందిరం గురించి ప్రస్తావించగానే… జై శ్రీరామ్ నినాదాలతో సభ నిమిషం పాటు మార్మోగిపోయింది. దాంతో రాజ్ నాథ్ చిరునవ్వుతో ఆ నినాదాలను ఆస్వాదించారు. అనంతరం ఆయన ప్రసంగం కొనసాగిస్తూ… కొన్ని ప్రభుత్వాలు అధికారం కోసం రాజకీయాలు చేస్తాయని, మోదీ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం రాజకీయాలు చేస్తుందని వివరించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించి భారతీయుల కలను సాకారం చేశామని అన్నారు. దేశ ప్రజలు మోదీ వెన్నంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఆర్థికంగా బలహీన దేశం అనే ముద్ర నుంచి భారత్ ను బయటికి తీసుకువచ్చి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ను నిలిపిన ఘనత మోదీకే సొంతమని అన్నారు. మోదీ పాలనలో భారత్ 2027లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.