తిరువనంతపురం: భారత్ మొట్టమొదటిసారి చేపడుతున్న మానవ-సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. గతంలో రాకేశ్‌శర్మ భారత్ తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి.. ఆయన రష్యా తరుపున వెళ్లారు.
ఇంతటి ప్రతిష్ఠాత్మక గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు చెందిన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా గగన్ యాన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రోదసిలోకి వెళ్లనున్నారని మోదీ తెలిపారు. ఇవి నాలుగు పేర్లు కాదు… 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని అభివర్ణించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. 40 ఏళ్ల కిందట రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లగా… మళ్లీ ఇన్నాళ్లకు భారతీయులు అంతరిక్షంలోకి వెళుతున్నారని… అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అని స్పష్టం చేశారు. రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 3న రష్యా వ్యోమనౌక సోయుజ్ టి-11 ద్వారా మరో ఇద్దరు రష్యన్లతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇప్పుడు, మరోసారి భారతీయులు అంతరిక్షంలోకి వెళుతుండగా, ఆ నలుగురు వ్యోమగాములకు కూడా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ శిక్షణ ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ వచ్చే ఏడాది జరగనుంది.