తాజా వార్తలుశ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..!

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..!

చంద్రగిరి:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంనిర్వహించడం ఆనవాయితీ.ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.


పరదాలు విరాళం :
తిరుపతికి చెందిన శ్రీ మ‌ణి రెండు పరదాలు, రెండు‌ కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటినివినియోగించ నున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్‌ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : ఈనెల 29వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం, మార్చి 1వ తేదీ ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం, 2వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 3వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం,4 వ తేదీ ఉదయం పల్లకి ఉత్సవం, (మోహిని అవతారం) రాత్రి గరుడ వాహనం,5వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,7వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం,8వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజవరోహణం తో ఉత్సవాలు ముగింపు.


ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్లకు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article