అమరావతి:టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ ఇవాళ సమావేశమైంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య హాజరు కాగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, పాలవలస యశస్వి, మహేందర్ రెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేయాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారంపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఏ ఏ హామీలను మేనిఫెస్టోలో చేరిస్తే ఓట్లు సాధించవచ్చనే చర్చ నడిచినట్లు సమాచారం. అలాగే ఈ సమావేశంలో డ్వాక్రా రుణమాఫీ హామీపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం సాధ్యమా కాదా? మహిళలను ఆకట్టుకునేందుకు ఇంకా ఏమైనా పథకాలు తీసుకురావాలా అనే కోణంలో కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి బహిరంగ సభను పెట్టాలని, పెడితే ఎక్కడ పెట్టాలనే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు అయినప్పటికీ అక్కడక్కడ ఈ రెండు పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం ఉందని, ఆ గ్యాప్ ను ఎలా పూడ్చాలనే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్న నేపథ్యంలో దానిపై కూడా చర్చించినట్లు సమాచారం.