విద్యార్థినులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేసిన వివేకానంద ఫౌండేషన్
పోరుమామిళ్ళ :
పట్టణ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ బాలికలకు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు అవసరమైన పరీక్షా సామాగ్రిని మంగళవారం వివేకానంద ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ళ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి మాట్లాడుతూ ఆకతాయిల వలన ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చాడు. పరీక్షల పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పాఠశాలలోని 108 మంది బాలికలకు దాదాపు పదివేల రూపాయలు విలువైన పరీక్షా సామాగ్రిని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన హెచ్. పి.గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కత్రిమల ఓబులేసు సహాయం చేయడమే కాకుండా స్వయంగా కార్యక్రమం లో పాల్గొని విద్యార్థినులను భయపడకుండా పరీక్షలు రాయాలని ప్రోత్సహించాడు.
వివేకానంద ఫౌండేషన్ సంస్థ గౌరవ సలహాదారుడు రాజోలి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆకర్షణలకు లోనై చెడుమార్గం వైపు వెళ్ళి జీవితాలను దుర్భరం చేసుకోవద్దని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని బాలికల్లో స్ఫూర్తిని నింపారు. వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను సన్మార్గం వైపు నడిపించడం కోసం సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి ఎ. జయరాం, నజీమా బేగం, ఎ. పద్మావతి, కె. సుప్రజ కె. ధనలక్ష్మి , బి.లూస్సీ తదితరులు పాల్గొన్నారు.