ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వైలెన్స్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు*
కడప బ్యూరో

: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు.. రానున్న సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఎన్నికల నిర్వహణ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కడప జిల్లా పరిషత్ సభా భవనంలో సాధారణ ఎన్నికలు- 2024 లకు సంబంధించి ఈఆర్ఓలు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్, వీడియో వ్యూవింగ్ టీమ్స్ మొదలైన ఎన్నికల ప్రవర్తన నియమావళి సిబ్బంది, అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్ ట్రైనర్స్ కు కడప నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా కాలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు… అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అదనపు ఎస్పీ (అడ్మిన్) సుధాకర్ బాబులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డా౹౹ అంబవరం ప్రభాకర్ రెడ్డి, మెప్మా పీడీ సురేష్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనా అధికారి సురేష్ కుమార్, డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి జే.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు మాట్లాడుతూ… మరో కొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాకున్న నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి సంసిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రాధాన్యతతో, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందన్నారు.
ముఖ్యంగా ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పక పాటించాలన్నారు. అందులో ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ.. పారదర్శక ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 24 గంటలలోనే పార్టీలకు సంబంధించిన గుర్తులు, రాజకీయ పార్టీల నేపథ్యం ఉన్న పర్సన్స్ కు సంబందించిన ఫోటోలను ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, పబ్లిక్ ప్రదేశాలలో పూర్తిగా తొలగించాలన్నారు.
ఎన్నికల విధి నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రతి అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ.. చిత్తశుద్ధితో, భాధ్యతాయుతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మాస్టర్ ట్రైనర్లు పోలింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా డీఎస్పీ లు, పోలీస్ సిబ్బంది, ఎన్నికల విధులకు హాజరయ్యే వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.