విద్యాహక్కు పాత నినాదం.. నాణ్యమైన విద్యా హక్కు కొత్త నినాదం
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాల కోసమే ఎడెక్స్‌తో ఒప్పందం : సిఎం జగన్
అమరావతి: ప్రముఖ ఈ-లెర్నింగ్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 12 లక్షల విద్యార్ధులకు 2 వేలకు పైగా కోర్సుల్ని ఆన్ లైన్ లో అందించేందుకు వీలుగా సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.దాదాపుగా 26 యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఏపీ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయమని సీఎం జగన్ తెలిపారు.విద్యాహక్కు పాత నినాదమని, నాణ్యమైన విద్యా హక్కు కొత్త నినాదమని సీఎం జగన్ ఎడెక్స్ తో ఒప్పందం సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో పిల్లలు చుట్టుపక్కల రాష్ట్రాలు, ఈ దేశంలో విద్యార్దులతో కాదని ప్రపంచంతో అన్నారు. పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలంటే, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు రావాలంటే విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు అవసరమని జగన్ తెలిపారు. ఉన్నత విద్యలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే నాలుగైదేళ్లు పట్టవచ్చన్నారు.ఎడెక్స్ ఒప్పందంతో దాదాపు 2వేలకు పైగా కోర్సులు పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులు దీని ద్వారా నేర్చుకోవచ్చన్నారు. వాళ్లు కోర్సులు ఆఫర్ చేసి బోధిస్తారని, పిల్లలు ఆన్‌లైన్‌లో వాళ్లతో ఇంటరాక్ట్ అయి డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయన్నారు. ఫైనల్‌గా పరీక్షలు ఉంటాయన్నారు. పిల్లలు ఆ పరీక్షలు పాసైతే క్రెడిట్స్ వారి పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయన్నారు.రాష్ట్రంలో యూనివర్సిటీలలో అందుబాటులో లేని కోర్సులు కూడా ఎడెక్స్ లో నేర్చుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజిమెంట్, రిస్క్ మేనేజిమెంట్ వంటి వర్టికల్స్ పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో భాగంగా అందుబాటులో కనిపిస్తాయన్నారు. మన దగ్గర ఇవేవీ కనిపించవన్నారు.ఈ కోర్సులు అందుబాటులో ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల వాళ్లే… ఏకంగా మన కరిక్యులమ్‌లో భాగమై, ఈ అంశాలను బోధించేలా మన పిల్లలకు అందుబాటులో తీసుకువస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇది పెద్ద మార్పన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆంధ్రాయూనివర్సిటీ నుంచి తీసుకునే ఈ డిగ్రీలో స్టాక్ ఎక్సెంజ్, రిస్క్ మేనేజిమెంట్, వెల్త్ మేనేజిమెంట్, ఫైథాన్ కోర్సుల వంటివన్నీ ఎంఐటీ, హార్వర్డు సంస్ధలు సర్టిఫై చేసి మన పిల్లలకు ఇస్తాయన్నారు. ఆయా సంస్ధలకు వెళ్లి చదువుకున్నవాళ్లు చేసే కోర్సులు ఇక్కడే మన యూనివర్సిటీల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.