మేడారం:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తజనం వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక జాతరలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన సేవలను అందించడానికి పోలీస్ శాఖ సన్నద్ధమైంది. ఈసారి మేడారంలో మెరుగైన సేవలకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం ఉపయోగించనున్నారు. మేడారం మహా జాతరలో కృత్రిమ మేధ సహాయంతో మేడారం జాతర రద్దీ నియంత్రణ చేయాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను కెమెరాలలో ఇన్స్టాల్ చేసి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తారు. సిబ్బందిని అప్రమత్తం చేయడానికి, రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు. అంతేకాదు ఎక్కడికక్కడ క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు లెక్కించనున్నారు. గద్దెల చుట్టూ క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో నిరంతరం నిఘా నిర్వహించడంతోపాటు, మేడారం జాతర జరిగే ప్రదేశమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టనున్నారు.
ఇప్పటివరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు పట్టణ శివారు గట్టమ్మ ఆలయం నుండి మేడారం జాతర జరిగే ప్రదేశాల వరకు మొత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం పర్యవేక్షించడం కోసం మేడారంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దొంగతనాలు, ఘర్షణలు, ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులను తెలుసుకొని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించనున్నారు. ఇక జాతరలో తప్పిపోయిన వారి కోసం ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి, జాతర విశేషాలతో పాటు, స్క్రీన్ లపై తప్పిపోయిన వారి వివరాలను ఫోటోలను ప్రదర్శించనున్నారు. ఐదు డ్రోన్ కెమెరాలతో మేడారం జాతరను పోలీస్ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.