ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.
పోలవరం:
పోలవరం నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధి ఒక్కటే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు, కులమతాలకు, వర్గాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేశానని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం మండలంలో పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ , ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి తదితరులతో కలిసి శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో గూటాలలో సొసైటీ గోడౌన్, రైతు భరోసా కేంద్రం, కొత్త పట్టిసీమలో రాచకట్టు చెరువు కల్వర్టు, సిసి రోడ్డు ప్రారంభోత్సవాలు, పక్కా డ్రైన్స్ శంకుస్థాపన, పాత పట్టిసీమలో బస్ షెల్టర్, సొసైటీ గోడౌన్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిరిజన సంక్షేమం దృష్ట్యా పోలవరం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధికరమైన పాలన కోసం ప్రజలు తిరిగి వైసిపి ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. తెలుగుదేశం పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గ అభివృద్ధి గత ఐదేళ్లుగా వైసిపి పాలనతో ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్, జడ్పిటిసి, వైసీపీ మండల కన్వీనర్, పలువురు సర్పంచులు, గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, సభ్యులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు