హిందూపురం టౌన్
గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు స్థానికంగా మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కో శాధికారి సాంబశివ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ చాంబర్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత సంవత్సరం డిసెంబర్ నెలలో 16 రోజుల పాటు సమ్మె చేయడం జరిగిందన్నారు. దీంతో అప్పట్లో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదన్నారు. వీటిని అమలు చేయక పోతే తాము మరో సారి మెరుపు సమ్మెలోకి వెళ్తామన్నారు. దీంతో పాటు స్థానికంగా కరోనా సమయంలో దినసరి వేతనం కింద తీసుకున్న 85 మంది కార్మికులకు రూ.400 నుంచి 560 వరకు రోజు వేతనం పెంచుతామని, పట్టణ విస్తరణ, జనాభాకు అనుగుణంగా మరో 15 మంది కార్మికులను దినసరి వేతనం కింద తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పాటు కార్మికులకు పని ముట్లు ఇవ్వాలని అడిగితే ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. వీటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ గత కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సాధ్యం కా దన్నారు. దీంతో కార్మికులు ఆవేశంగా గత కమీషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గట్టిగా నినాదాలు చేశారు. కమిషనర్ స్పందించక పోవడంతో భవిష్యత్తు కార్యాచరణకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించి బయటకు వచ్చారు. త్వరలో మున్సిపల్ కార్మికులు స్థానిక సమస్యలపై సమ్మెలోకి వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజప్ప, రామక్రిష్ణ, మున్సిపల్ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి జగదీష్, కోశాధికారి ఆనంద్, గురునాధ్, పరమేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.