సర్వం కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిందే మార్కాపురంను జిల్లాగా ప్రకటన చేయాలి:ఆప్ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ డిమాండ్
మార్కాపురం
మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు హమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రారంభిస్తే అడ్డుకుంటామని, ప్రాజెక్టు నిర్మాణంపై నిజం తెలపాలని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురు వెలుగొండ ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించాలని, మార్కాపురం జిల్లాగా ప్రకటన చేయాలని కోరుతూ శనివారం రిలే దీక్ష జరిగింది. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధులు మంజూరు చేయకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయడానికి అవసరమయ్యే 1800 కోట్లు నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టు పూర్తయిందని మభ్యపెడుతూ ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని కల్లబొల్లి మాటలతో కాలయాపన చేసే మీ కుటిల బుద్ధులు ఆపాలని కోరారు. కొందరి స్వార్థ రాజకీయాల వలన మార్కాపురం జిల్లా కాలేకపోయిందని, వెంటనే మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు అందె నాసారయ్య, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ చైర్మన్ కందుల రామిరెడ్డి, సిపిఐ (ఎం) నాయకులు గుమ్మా బాలనాగయ్య, ఉపాధ్యాయ సంఘ నాయకులు నల్లబోతుల శ్రీనివాసరావులు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుపై, జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని అబద్ధపు వాగ్దానాలతో మోసపు మాటలతో మళ్లీ మోసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం నిర్వాసితుల పక్షాన కలిసి పోరాటం చేస్తామని పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షకు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొమ్ము నవీన్ కుమార్, యన్.రమణయ్య నిర్వాసితులు ఎన్.సూరి జి.గురవయ్య, వై.మోషే, యల్. జాన్’పాల్ తదితరులు పాల్గొన్నారు.