Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుచదువు చెప్పడంతో పాటు చదివించాలి

చదువు చెప్పడంతో పాటు చదివించాలి

  • మార్పు రాకపోతే చర్యలు తప్పవు
  • ఉపాధ్యాయులతో డిఈఓ మీనాక్షి

  • హిందూపురం టౌన్
    ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పడం కాదు… వారితో చదివించి మెరుగైన ఫలితాలను తీసుకురావాలని, ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఎంజీఎం పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలన చేశారు. ఉపాధ్యాయ హాజరు పట్టికలో ఓ డి లు ఎక్కువ రాసి ఉండడంతో ఇన్ని ఓడి లు ఎందుకు తీసుకున్నారని అని హెచ్ఎం సామ్రాజ్యం ను అడిగినారు. ఎవరైనా ఓడి తీసుకుంటే దానికి సంబంధించి వివరాలను నమోదు చేయాలని ఆమెకు సూచించారు. అనంతరం పదవ తరగతికి సంబంధించి మెరుగైన ఫలితాలు సాధించడానికి తీసుకుంటున్న చర్యలపై హెచ్ఎం ను అడిగారు. అనంతరం ఉపాధ్యాయులతో ఆమె సమావేశమయ్యారు. గతంలో వచ్చిన పదవ తరగతి ఫలితాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక సబ్జెక్టుకు ముగ్గురు నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఫలితాలు ఎందుకు రావడం లేదన్నారు. తాము పాఠ్యాంశాలు బోధిస్తున్నామని, విద్యార్థులు చదవడం లేదని కొంతమంది ఉపాధ్యాయులు చెప్పడంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలు బోధించే సమయంలో విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో చెబితే ఎందుకు అర్థం చేసుకోరని, అలా చేతకాకపోతే ఎందుకు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పడం కాదు, చదివించాలని, అప్పటికీ విద్యార్థులు వెనకబడి ఉంటే వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు వారిని దత్తత తీసుకొని వారికి అర్థమయ్యే విధానంలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏదో కాలక్షేపానికి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయాలని చూస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పురపాలక సంఘ పాఠశాలల్లో పని చేస్తున్నామని, తామందరం ఇక్కడే పాతుకు పోయామని, మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేరన్న ఆలోచనల నుంచి బయటకు రావాలన్నారు. మున్సిపల్ పాఠశాలలు అన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని, ఇకపై నిత్యం పాఠశాలలను పర్యవేక్షణ చేస్తామన్నారు. మార్పులు రాకపోతే, కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని, దానికి సంబంధించి ఉపాధ్యాయులు ప్రణాళిక ను రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఆ పాఠశాలను విస్మరించడం తగదన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని తాము పరిష్కరిస్తామన్నారు. మరో వారం రోజుల్లో మరోసారి పాఠశాల తనిఖీకి వస్తానని అప్పటిలోగా ఉపాధ్యాయుల్లో మార్పు రావాలన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణగా ఉండడం లేదని డిఈఓ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. తనతో ఉపాధ్యాయులు క్రమశిక్షణగా ఉంటే మిమ్మల్ని చూసి విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటారన్నారు. అప్పటికీ విద్యార్థుల్లో మార్పు రాకపోతే వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. నిధులు లేక పూర్తి చేయలేకపోయాం….
    జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో ప్రారంభించిన పనులు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తి చేయలేకపోయామన్నారు. దాదాపు రూ.40 కోట్ల వరకు జిల్లాకు నాడు నేడు పథకం కింద నిధులు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులు వచ్చిన వెంటనే రెండవ విడత ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నామన్నారు. దీనిపై ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశామని, తప్పకుండా మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. ఈమె వెంట ఎంఈఓ- 2 ప్రసన్న లక్ష్మి ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article