Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలువెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై పాలక ప్రభుత్వానిది అబూత కల్పన

వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై పాలక ప్రభుత్వానిది అబూత కల్పన

ఆప్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

మార్కాపురం

మార్కాపురం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై పాలక ప్రభుత్వం చర్యలు మంచిది కాదని, జరగని పనిని జరిగినట్లు చూపించి మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ ధ్వజమెత్తారు. శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సత్వర నిర్మాణం పూర్తి కొరకు, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం 1800 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని మరియు మార్కాపురం డివిజన్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని కోరుతూ బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కానిదే, జాతికి అంకితం చేయనిదే ఎన్నికలకు రామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట నెరవేరకపోవడంతో రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారనే కారణంతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కానిదే ప్రారంభిస్తామని కపట నాటకాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు. పశ్చిమ ప్రకాశంలోని ఎమ్మెల్యేల చేతకానితనమే మార్కాపురం జిల్లా ఏర్పాటు కాలేదని దుయ్యబట్టారు. సిపిఐ జిల్లా నాయకులు అందే నాసరయ్య, సిపిఐ(ఎం) జిల్లా నాయకులు డి.సోమయ్యలు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని, అందుకు నిదర్శనమే గత బడ్జెట్లో 101 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడమన్నారు. సర్వం కోల్పోయిన నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా పూర్తికాని ప్రాజెక్టును ఏ విధంగా ప్రారంభిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగా ప్రాజెక్టు పూర్తయితే అఖిలపక్ష పార్టీల నాయకులను తీసుకుపోయి చూపించాలని కోరారు. ఇక ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై మీన మీసాలు లెక్కించవద్దని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు ఎం.వి. సురేష్, బిజెపి పార్టీ ఇన్’చార్జి పి.వి.కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకురాలు రెహనా బేగం, జి.బాల నాగయ్యలు మాట్లాడుతూ కేవలం మిగులు జలాల మీదనే వేలకోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాలు ఏర్పాటు చేస్తేనే ప్రాజెక్టు ఉద్దేశం నెరవేరుతుందని అన్నారు. పక్క రాష్ట్రాలతో ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేసి మిగులు జలాలు కాకుండా నికర జలాలు కేటాయించాలని, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభించాలని, మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటిస్తూ అభివృద్ధికి పదివేల కోట్లు నిధులు మంజూరు చేయాలని, రానున్న వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని, పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.రూబెన్ జనసేన నాయకులు సిరిగిరి శ్రీను, బొందిలి కాశీరాం సింగ్, కె.వి.పి.ఎస్ నాయకులు రాజు, ప్రజా సంఘ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article