బుట్టాయగూడెం.
వైయస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మహిళలు అన్నమో రామచంద్ర అంటూ ఆకలితో నకనకలాడారు. వైయస్సార్ ఆసరా నిధుల మంజూరు కార్యక్రమాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలం లోని పలు గ్రామాల నుండి లబ్ధిదారులైన మహిళలను సుమారు 6000 మంది మహిళలను తరలించారు. సుమారు 11 గంటలకు ప్రారంభమైన బహిరంగ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించారు. సభ ముగిసే సమయానికి ఒక ట్రక్కులో సుమారు 2000 బిర్యానీ పొట్లాలను తీసుకువచ్చి పంపిణీ ప్రారంభించారు. వేలాదిగా ఉన్న మహిళలు ఒక్కసారిగా బిర్యానీ పొట్లాల కోసం ఎగబడ్డారు. కానీ తెచ్చింది 2000 ప్యాకెట్లే కావడంతో మహిళలకు ప్యాకెట్లు అందక ఆకలితో నకలకులాడారు. సభ జరుగుతున్నప్పుడు కూడా కనీసం త్రాగడానికి నీరు కూడా సరఫరా చేయకపోవడంతో మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సరైన అంచనా లేకపోవడంతో వేలాదిగా వచ్చిన మహిళలు తినడానికి ఏమీ దొరకని పరిస్థితుల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఖాళీ కడుపుతో ఇంటిదారి పట్టారు.