బుట్టాయగూడెం.
టిబిఆర్ ట్రోఫీ సీజన్- 5 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు పుట్టినరోజు సందర్భంగా గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది టిబిఆర్ ట్రోఫీ పేరిట భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎమ్మెల్యే బాలరాజు పుట్టినరోజు సందర్భంగా జనవరి నెలలో నిర్వహించవలసిన క్రీడా పోటీలను సాంకేతిక కారణాల వలన వాయిదా వేశారు. టీవీఆర్ ట్రోఫీ సీజన్ 5 క్రీడా పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో తెల్లం బాలరాజు పౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే బాలరాజు, పోలవరం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి, కె.ఆర్. పురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఎం. సూర్య తేజ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలలో ఉత్సాహవంత మైన యువతీ యువకులు ప్రతి ఒక్కరు పాల్గొని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు. టిబిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏడాది వాలీబాల్, కోకో, కబడ్డీ, లాంటి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలలో నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఐటీడీఏ పీవోఎం.సూర్య తేజ మాట్లాడుతూ క్రీడా రంగానికి టీబీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రీడలలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని హితవు పలికారు. వైసీపీ సమన్వయకర్త టి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ టిబిఆర్ ఫౌండేషన్ ద్వారా టీవీఆర్ ట్రోఫీ క్రీడా పోటీలను ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది ఈ క్రీడా పోటీలను నిర్వహించడం సంప్రదాయంగా తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మొడియం రామతులసి, స్థానిక సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ, వైస్సార్సీపీ నాయకులు, సర్పంచులు,వార్డు మెంబర్లు,ఎంపీటీసీలు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు, పాల్గొన్నారు